ఇ-సేవా కేంద్రాల్లో మరిన్ని సేవలు
(Now e-Seva centers offer new services)
భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వినూత్న సేవలందిస్తూ సంచలనంగా నిలిచిన మన రాష్ట్ర ఇ-సేవా కేంద్రాల్లో మరిన్ని సేవలందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 160 రకాల సేవలందిస్తున్న ఇ-సేవా కేంద్రాల్లో ఇకపై Passport దరఖాస్తు స్వీకరణ, Ration Cardలలో దిద్దుబాటు, PAN కార్డు దరఖాస్తు సేవ, Mobile Phone ద్వారా బిల్లుల చెల్లింపు, ఒక ప్రయివేటు మొబైల్ సేవల సంస్థకోసం డాక్యుమెంట్ల సేకరణ తదితర సేవలకు రంగం సిద్ధమైంది. రాజధాని హైదరాబాద్ నగరంలోని సచివాలయంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి కె వెంకటరెడ్డి కార్యాలయంలో ఈ సేవల్ని ప్రారంభించారు.
ఈ నూతన సేవల్లో భాగంగా GPRS అనుకూలత ఉన్న Mobile Phoneల ద్వారా విద్యుత్, టెలీఫోన్, నీటి బిల్లులు చెల్లించేందుకు ఇ-సేవా కేంద్రాలు వీలు కల్పిస్తాయి. ఈ బిల్లులు చెల్లించాల్సిన ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ చాంతాడు వరుసల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో పని పూర్తి చేసుకోవచ్చు.
ఈ సేవల్ని వినియోగించుకోదలచిన ఖాతాదార్లు www.esevaonline.com వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. తమ బిల్లు ఏ సేవకు సంబంధించిందో ఎంచుకుని, బిల్ నంబర్ ఇవ్వాలి. తర్వాత బిల్లు మొత్తాన్ని ఎలా చెల్లిస్తారనేది (డెబిట్ లేదా క్రెడిట్ కార్డు) ఎంపిక చెయ్యాలి. తర్వాత ఈ ఇ-సేవ వ్యవస్థ, కార్డుకు సంబంధించిన బ్యాంక్ gateway ద్వారా ఈ వ్యవహార ప్రక్రియ కొనసాగడం ద్వారా ఇ-సేవ ఖాతాలో సదరు మొత్తం జమ అవుతుంది. అనంతరం కంప్యూటర్ వ్యవస్థ ద్వారా ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక సంఖ్య ఖాతాదారునికి వెళుతుంది. భవిష్యత్తులో ఈ చెల్లింపుపై ఎలాంటి పరిణామాలైనా సంభవించినప్పుడు సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ సంఖ్యే ఆధారంగా ఉంటుంది.
ఈ కార్యకలాపాలకు ఇ-సేవా కేంద్రాలు ఛార్జీలేమీ విధించవు. అయితే, క్రెడిట్ కార్డు వాడకందార్లు ఇలాంటి కార్యకలాపాలకుగాను 1.75 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డెబిట్ కార్డులపై ఆయా బ్యాంకులు స్వల్ప మొత్తం వసూలు చేస్తాయి.
సాధారణ రుసుములతోనే సత్వర సేవలందిస్తున్న ఇ-సేవా కేంద్రాలు గత మార్చి నెలలో జనన మరణ ధృవీకరణ పత్రాల జారీతో పాటు వాటిలో సవరణల సదుపాయం కూడా కల్పించాయి. అంతకు ముందు సవరణల కోసం ప్రజలు ఎఎంఓహెచ్‌లను కలుసుకోవలసి వచ్చేది. ఇప్పుడు ఇ-సేవా కేంద్రాలే ఈ బాధ్యత స్వీకరించాయి. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించే దిశగా సర్కిళ్ళవారీగా సిటిజన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు, ఫైల్ మేనేజిమెంట్ వ్యవస్థల అభివృద్ధిపైనా దృష్టి సారించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) నిర్ణయించుకుంది. ఇందుకు ఇ-సేవా కేంద్రాల్ని మరింతగా వినియోగించుకోవాలని భావిస్తున్నది.