సమాజాభివృద్ధిలో సామాజిక వెబ్‌సైట్లు
(Social Portals for Society development)
ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్‌లో సామాజిక దృష్టికోణంతో సేవలందించే పలు వెబ్‌సైట్లు గతంలో పరిమితంగా ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. సామాజిక దృష్టికోణం అంటే విద్య, వైద్యం మొదలుకొని వెబ్ మాధ్యమంతో పౌరులకు ఎన్ని విధాలుగా సేవలందించడం సాధ్యమో అన్ని రకాలుగా చేయూతనందించే సైట్లను పలువురు ప్రారంభించారు. వీటి లక్ష్యం సమాజ శ్రేయస్సే...
ఒకప్పుడు సాయమందించే చేతులు చేరువలోనే ఉన్నప్పటికీ చిరునామా లేదా ఫోన్ నంబర్లు తెలియక ఆ సాయం అందిపుచ్చుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి దాతల్లో టెక్నాలజీ పట్ల అవగాహన పెరగడంతో వారంతా వెబ్‌సైట్లు, బ్లాగులు, మొబైల్ ఫోన్ల ద్వారా సమాజ సేవకు ముందడుగు వేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు ఒక వెబ్‌సైట్ ప్రారంభించాడు. దీని లక్ష్యం ఏమిటంటే, ఎవరైనా తమ దగ్గరున్న వస్తువుల్ని ఉచితంగా ఇచ్చేయాలనుకున్నా లేదా తక్కువ ధరకు విక్రయించాలనుకున్నా ఆ కార్యకలాపాలకు ఈ సైట్ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. ఆర్థికమాంద్యంతో కొనుగోలుశక్తి క్షీణించిన జనం ఏం కొనాలన్నా జేబులు తడుముకోవాల్సి వస్తుండటంతో ఆ యువకుడు ఈ సైట్‌కు శ్రీకారం చుట్టాడు. ఉపయోగించిన పుస్తకాలు, గృహోపకరణాలు, సైకిళ్లు, కెమెరాలు, కంప్యూటర్లు, డీవీడీ ప్లేయర్లు, ఇంకా మరేవైనా వస్తువుల్ని www.things2offer.com అనే ఈ సైట్ ద్వారా మారకం చేసుకోవచ్చు.
ఇక వైద్యపరంగా చూస్తే మన రాష్ట్రానికే చెందిన కొందరు వ్యక్తులు కొందరు ఒక ఆన్‌లైన్ రక్తనిధిని ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, ప్రమాదానికి గురైనవారికి అవసరమైన రక్తాన్ని ఉచితంగా అందించేందుకుగాను ఆన్‌లైన్ రక్తనిధి ప్రారంభమైంది. రక్తం కావలసినవారు www.friends2support.org సైట్‌ని సంప్రదిస్తే కావలసిన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కలిగి ఉన్న వ్యక్తులను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రాణాల్ని నిలబెడుతుంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని మరో యువతి ఇలాగే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి తన సేవల్ని కొనసాగిస్తోంది. దాతలెవరైనా ఏ రూపంలో అయినా సేవలు అందించాలనుకుంటే www.shareaservice.com అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఈ సైట్ నిర్వాహకులు ఆ సేవలు సరైనవారికి చేరేలా తోడ్పాటును అందిస్తారు.
ఇక అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేసే
“సత్యహరిశ్చంద్ర అనాథ శవసేవా సమితి” సంస్థను www.unknownbodies.com అనే సైట్ ద్వారా సంప్రదించవచ్చు.
విద్యాపరంగా చూస్తే... హైదరాబాద్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన బహుభాషా పరిజ్ఞానానికి e-book రూపం ఇచ్చి ఎంతమందైనా దానిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ విధంగా విద్యాసేవలు అందిస్తున్నవారు మరెందరో ఉన్నారు. అదే క్రమంలో మంచి రచనలు చేసిన వ్యక్తుల సృజనకు వెబ్ రూపమిచ్చేందుకు www.pustakam.net అనే వెబ్‌సైట్ ముందుకువచ్చింది.
ఇలాంటి వెబ్‌సైట్ల మార్గంలోనే పలు బ్లాగులు కూడా విద్యాసేవలు అందిస్తున్నాయి. బ్లాగుల విషయానికి వస్తే భాషలు నేర్పేవి, సాంకేతిక అంశాలు, సాఫ్ట్‌వేర్లకు సంబంధించిన చిట్కాలను ఉచితంగా తెలియజేసేవి చాలా ఎక్కువగానే కనిపిస్తాయి.
సామాజిక స్పృహకల్గిన ఎందరో వ్యక్తులు ఇలా వెబ్‌సైట్లు, బ్లాగుల రూపంలో తమ సేవలందిస్తూ మరెంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.