ఐటీ బాటలో వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్
(Warangal Municipal Corporation... Now an IT savvy)
వరంగల్ నగర పౌరుల నుంచి పన్నులు వసూలు చేసే క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సేవలను ఉపయోగించుకునే దిశగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సన్నద్ధమవుతున్నది. పన్ను చెల్లింపుదార్లకు నిరంతరం అందుబాటులో ఉంటూ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, తపాలా సేవలు లాంటి వివిధ మార్గాల్లో పన్ను పసూళ్ళను పెంచుకోవాలని ఈ మున్సిపల్ కార్పోరేషన్ అధికార్లు భావిస్తున్నారు.
వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అధికార్ల ప్రణాళికలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే... గడువు తేదీకి కాస్త ముందుగానే పన్నులు చెల్లించాలని కోరుతూ పన్ను చెల్లింపు దార్ల మొబైల్ ఫోన్లకు క్లుప్త సందేశాలు (ఎస్ఎంఎస్‌లు) వస్తాయి. పన్ను చెల్లించిన తర్వాత వారికి ధన్యవాదాలు తెలిపే సందేశమూ వస్తుందట. ఈ సందేశాలకు స్పందించి సత్వరం పన్నులు చెల్లించే పౌరులకు కానుకలు కూడా ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉందట.
ఇక ఐటీ సేవల వినియోగంలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్ వారు ఇప్పటికే పెద్ద ఎత్తున నగర పౌరుల మొబైల్ ఫోన్ నంబర్లను సేకరించారు. మరికొన్ని రోజుల్లో వీలైనన్ని ఎక్కువ నంబర్ల సేకరణ పూర్తవుతుందట. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో వరంగల్ పౌరులు ఆన్‌లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా తపాలా ద్వారా పన్నులు చెల్లించవచ్చు. సెలవు దినాలు, చాంతాడు వరుసలు లాంటి అడ్డంకులుండవు. పన్నుల వసూలు ప్రక్రియలో భాగంగా ATM మెషీన్లను కూడా ఏర్పాటు చేసే ఉద్దేశ్యం కూడా ఉందట. ఇప్పటివరకూ అయితే e-Seva కేంద్రాల ద్వారా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పన్నులు వసూలు చేస్తున్నది.