ఇంటర్నెట్ ద్వారా తెలుగుభాష వ్యాప్తి, తెలుగు బ్లాగులకు మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ e-తెలుగు. కంప్యూటర్లకు తెలుగు నేర్పించడం ఎలా? యూనికోడ్ తెలుగు ఫాంట్‌తో పైసా ఖర్చు లేకుండా మన ఆలోచనలకు ఇంటర్నెట్‌లో అక్షరరూపం ఇవ్వడం ఎలా? వీటిని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? టైపింగ్ లేఅవుట్ ఏమిటి? ఇత్యాది పలు అంశాలకు సంబంధించిన పరిష్కారాలను స్వచ్ఛందంగా అందజేస్తూ ఇంటర్నెట్‌లో తెలుగు వాడకానికి సంబంధించిన సాంకేతిక సహకారాన్నీ, తోడ్పాటును ఉచితంగా ఇస్తుంది e-తెలుగు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కేంద్రంగా సేవలందిస్తున్న e-తెలుగు సంస్థ కార్యదర్శి పలివెల కృపాల్ కశ్యప్. ఇటీవల భాషా ఇండియా ఆయన్ని కలుసుకున్నప్పుడు సంస్థ పూర్వాపరాలు, కార్యకలాపాల గురించి ఎన్నో వివరాలందించారు.
-----------------------------------------------
ప్రశ్న: నమస్కారం కశ్యప్. ముందుగా మీ గురించి కొంచెం చెప్పండి.
జవాబు: నమస్కారం. నా స్వస్థలం ఖమ్మం జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం. నేను 2004 నుండి తెలుగు సాంకేతిక అంశాల మీద పని చేసున్నాను. ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రొడెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తూ e-తెలుగు సంస్థ కార్యదర్శిగా ఉన్నాను.
-----------------------------------------------
ప్రశ్న: e-తెలుగు ఎలా ప్రారంభమైంది.
జవాబు: ఒకసారి 2004లో ఇంటర్నెట్‌లో దేనికోసమో వెతుకుతుంటే అనుకోకుండా ముత్యాల్లాంటి తెలుగుపదాలు కనిపించాయి. ఇంకా శోధిస్తే అప్పటికే ఈ రంగంలో కృషిచేసిన వీవెన్, చదువరి, చావాకిరణ్, శోధన సుధాకర్, సీబీరావు తదితరులతో పరిచయాలు ఏర్పడ్డాయి. చాలామంది హైదరాబాద్ వాళ్లే కావటంతో తరచుగా ఒకచోట సమావేశం అయ్యే వాళ్లం. అలా మాలో ఉన్న భాషాభిమానం, ఆధునిక సమాచార విప్లవాన్ని అమ్మభాషకు అన్వయించాలన్న ఆరాటం e-తెలుగుకు నాంది పలికాయి. e-తెలుగును ఆంధ్రప్రదేశ్ సంఘాల రిజిస్ట్రేషను చట్టం 2001 (చట్టం-35) కింద నమోదు చేశాం. మా వెబ్ చిరునామా www.etelugu.org.
-----------------------------------------------
ప్రశ్న: e-తెలుగు కార్యకలాపాలు ఏమిటి ?
జవాబు: e-తెలుగు అన్నది కంప్యూటర్లు, అంతర్జాలం (ఇంటర్నెట్)లో తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో స్థాపించబడిన లాభాపేక్షలేని సంస్థ. తెలుగువారు తమ అవసరాలకి కంప్యూటర్లను, అంతర్జాలాన్ని మాతృభాషలోనే వాడుకోగలగాలి అన్నది e-తెలుగు స్వప్నం. ఆ దిశగా e-తెలుగు ఈ క్రింది కార్యకలాపాలను చెపట్టింది
1. కంప్యూటర్లలో తెలుగును చూడవచ్చు, వ్రాయవచ్చని తెలియచెప్పడం..
2. అందుకు సంబంధించిన ఉపకరణాల గురించి తెలియజెప్పడం..
3. అంతర్జాల అనుసంధానమున్న సామాన్య ప్రజలందరూ తమ ఉత్తరప్రత్యుత్తరాలను తెలుగులోనే జరుపుకోవడాన్ని ప్రోత్సహించడం..
4. సాధారణంగా ఉపయోగించే వెబ్‌సైట్లు, కంప్యూటర్ ఉపకరణాలను తెలుగులో అందుబాటులోకి తేవడం..
5. ఇప్పటికే ఉచితంగా లభ్యమవుతున్న ఉపకరణాలను పరిచయంచెయ్యడం, వాటిని వాడుకొనే పద్ధతులను తెలియజెప్పడం..
6. రోజువారీ సంభాషణల్ని తెలుగులో జరుపుకోవడాన్ని అంతర్జాల మాధ్యమాల ద్వారా ప్రోత్సహించడం..
7. తెలుగులో అందుబాటులో ఉన్న ఇమెయిల్, చాటింగ్ మొదలైన అంతర్జాల సేవల గూర్చి అవగాహన కలిగించడం..
8. యూనికోడ్ ఫాంట్ల ప్రయోజనాలను తెలియజేయడం..
9. సాంప్రదాయ/ప్రైవేటు సంకేతలిపుల నుండి యూనీకోడ్‌లోనికి మార్పిడి చేయడంలో అవసరమైన సాంకేతిక సహాయం అందించడం
-----------------------------------------------
ప్రశ్న: e-తెలుగు నిర్వహించే బ్లాగర్ల సమావేశాల గురించి చెప్పండి.
జవాబు: ఇంటర్నెట్‌లో తెలుగును వ్యాప్తిచేయడం, బ్లాగింగ్‌లో గల సాంకేతిక అంశాలను చర్చించడం ఈ సమావేశాల ప్రధానాంశాలు. కోత్తగా బ్లాగు రాసేవారిని ప్రోత్సహించడం, ప్రాంతాలవారీగా బ్లాగర్ల వర్క్‌షాప్‌లను ఏర్పాటు చెయ్యడం లాంటివి ఇతర అనుబంధ కార్యకలాపాలు. ఈ సమావేశాల్ని ప్రతి నెలా రెండవ ఆదివారం నిర్వహిస్తుంటాం.
-----------------------------------------------
ప్రశ్న: ఇంటర్నెట్‌లో తెలుగు వ్యాప్తికి బ్లాగులు ఎలా ఉపకరిస్తున్నాయి ?
జవాబు: బ్లాగరులు తమ ఆలోచనలను వారి మిత్రులతో URL ద్వారా పంచుకోంటారు, దీనిద్వారా ఇంటర్నెట్‌లో తెలుగు సమాచారం చాలా పెరుగుతున్నది. చాలామంది బ్లాగరులు వికిలోను, కొన్ని తెలుగు వెబ్ పత్రికలలోను విరివిరిగా రాస్తున్నారు. దీనివలన వికిపీడియా, ప్రాంతీయ భాషలలో వాడుకపరంగా మన తెలుగుభాష ముందుంది. కూడలి, జల్లెడ, హారం వంటి బ్లాగు అగ్రిగేటర్లను కొన్ని వేలమంది ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారు. Microsoft Live Spaces, Wordpress, Blogspot వంటి ప్రామాణిక ఉచిత బ్లాగు హోస్టర్ల వలన ఇంటర్నెట్‌లో తెలుగు వ్యాప్తి మరింత తేలిక అవుతున్నది.
-----------------------------------------------
ప్రశ్న: e-తెలుగు వెబ్‌సైట్ ద్వారా లభించే సహకారం గురించి తెలియజేయండి...
జవాబు: తెలుగులో ఎలా రాయవచ్చు? తెలుగు వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకోవడం ఎలా ? ఇతర OSలలో తెలుగు స్థాపించడం, RTS / Inscript / ITrans / Unicode వంటి అనువాద పక్రియలకు సంబందించిన సహకారము e-తెలుగు వెబ్‌సైట్ ద్వారా లభిస్తున్నది. etelugu.ourtoolbar.com ద్వారా అన్ని తెలుగు ఉపకణాలను సులువుగా పోందవచ్చు.
-----------------------------------------------
ప్రశ్న: e-తెలుగు అందించే సాంకేతిక సహకారం ఎలా ఉంటుంది ? మీరు వ్యక్తిగతంగా చేస్తున్న కార్యకలాపాలు ఏవైనా ఉన్నాయా?
జవాబు: e-తెలుగు అన్నది కంప్యూటర్లలోను, అంతర్జాలంలోను తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేస్తుంది. telugubloggers, telugu Wiki వంటి గుంపులలో e-తెలుగు సభ్యులు సాంకేతిక సహాయాన్ని అందజేస్తారు. ఇంటర్నెట్‌లో తెలుగు ఉపయోగించడం గురించి తెలియనివారికోసం ఉచితంగా సీడీ, బుక్ లెట్లు, కరపత్రాల పంపిణీ చేస్తుంటాము. ఇప్పటివరకు ౩౦ వేల కరపత్రాలు , ఐదువేల బుక్ లెట్లు, ఇంకా పదివేల ఉచిత సాంకేతిక ఉపకరణాల సీడీలని అందచేశాము. నేను కంప్యూటర్లలో తెలుగు వినటం మీద TEXT to Speech, తెలుగు OCR మీద పరిశోధన చేస్తున్నాను.
-----------------------------------------------
ప్రశ్న: ఇంటర్నెట్ యూజర్లతో మాత్రమే కాకుండా సామాన్యులకు చేరువయ్యేందుకోసం ఇ-తెలుగు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి?
జవాబు: సామాన్యులకు e-తెలుగు చేయవలసినది ఇంకా చాలా ఉంది. ఇంతవరకు మేము చేసినది ఒక గణన ప్రకారము చూస్తే, తెలుగు తెలిసిన ఇంటర్నెట్ యూజర్లలో కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్‌లో ఉచితముగా లభించే తెలుగు ఉపకరణాల గురించి, తెలుగులో కూడా ఇ-మెయిల్ చేయవచ్చని తెలుసు. మొదట వీరికి ఇంకా అవగాహన కల్పించిన తరువాత మరిందరు సామాన్యులకు చేరువకావాలన్నది మా ఉద్దేశ్యం. అంతేకాక గత రెండు సంవత్సరముల నుండి హైదరాబాద్, విజయవాడ పుస్తక ప్రదర్శనశాలల్లో ఒక స్టాలును ఏర్పాటు చేసి తెలుగు సాంకేతిక అంశాల గురించి లైవ్ ప్రొజెక్టర్, సదస్సులు, సీడీ, బుక్ లెట్, కరపత్రాల ద్వారా తెలియపరిచాము , అన్ని ప్రముఖ పత్రికలలో, టీవీల్లో తెలుగు సాంకేతిక అంశాల మీద ప్రత్యేక కధనాలు, కార్యక్రమాలు వచ్చాయి. ఈ నెలలో ప్రాత్రికేయుల కోసం ప్రత్యేకముగా ఒక వర్క్‌షాప్ ఏర్పాటుచేశాం.
-----------------------------------------------
ప్రశ్న: యునికోడ్ ఫాంట్స్ గురించి మరిన్ని విశేషాలు ఏవైనా...
జవాబు: తెలుగును యునికోడ్‌లో రాయటం ద్వారా ఎక్కువగా ఉపయోగించే ప్రముఖ Search Engineలో తెలుగు సమాచారం కోసం విస్తృతంగా శోధించవచ్చు. యునికోడ్‌కు మద్దతునిచ్చే అన్ని అప్లికేషన్లలోనూ తెలుగును సులభంగా వాడుకోవచ్చు.
-----------------------------------------------
ప్రశ్న: e-తెలుగు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించండి
జవాబు: కంప్యూటర్లలోను, అంతర్జాలంలోను ఉచితంగా వాడుకోగలిగే ఉపకరణాలను మరింతగా వాడుకలోకి తేవాలని, ,గ్రామీణ ప్రజలు ఇంకా, యువత కూడా తెలుగును విరివిరిగా వాడుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా తెలుగులో లాభాపేక్ష లేకుండా జరుగుతున్న పనులను ఉనికిలోకి తీసుకురావాలని, ఈ దిశగా అన్ని పట్టణాలు, గ్రామాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించాలని, ఇంకా ఇతర దేశాలు, రాష్ట్రాలలో తెలుగు మాట్లాడగలిగి, చదవటం, రాయటం రానివారికోసం ఒక Telugu E learning Multimedia free web portal ను సిద్ధం చెయ్యాలనేవి eతెలుగు భవిష్యత్ ప్రణాళికలు.
-----------------------------------------------
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌లో e-తెలుగు విస్తరణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
జవాబు: ఇప్పటికే విజయవాడలో ఒక e-తెలుగు శాఖను ప్రారంభించాము. రాబోయే సంవత్సరములో అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో e-తెలుగు శాఖను ఏర్పాటుచేయ్యాలని, అందుకోసం విరివిరిగా క్రార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం.