షాపింగ్ సమాచారాన్ని అందించే మైక్రోసాఫ్ట్ ఆరా
అటు వాణిజ్య ఉత్పత్తుల తయారీదారులు, ఇటు షాపింగ్ ప్రియులైన కోట్లాదిమంది వినియోగదారులు... ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నప్పటికీ తమకు కావలసిన ఉత్పత్తుల సమాచారాన్ని పొందేందుకు, పంపేందుకు సహకరించే విప్లవాత్మక సాఫ్ట్‌వేర్ రూపకల్పన దిశగా విఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు విజయవంతంగా సాగుతున్నాయి. వాణిజ్య రంగం, వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ తరహా సాఫ్ట్‌వేర్ పూర్తి స్థాయి పరిశోధనల అనంతరం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్‌డ్ యూజర్ రిసోర్స్ అన్నోటేషన్ (ఎ యు ఆర్ ఎ - ఆరా) సంక్షిప్తంగా ఎమ్ఎస్ ఆరా అంటారు. ఉత్పత్తుల కోసం నిరంతరం అన్వేషించే వినియోగదారులను ఉత్పత్తి సమాచార ప్రపంచంతో అనుసంధానించి వారు కోరిన సమాచారాన్ని అందిస్తుంది. విండోస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత మొబైల్ ఫోన్లు మరియు పోర్టబుల్ సాధనాలను కలిగి ఉన్న వినియోగదారులు ఈ ఎమ్ఎస్ ఆరాను లోడ్ చేసుకొని వాణిజ్య ఉత్పత్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు.
ఈ సాఫ్ట్‌వేర్ పనితీరును ఒకసారి పరిశీలిద్దాం. ఆరా లోడ్ అయి ఉన్న మొబైల్ ఫోన్లు లేదా సాధనాలకు ఉండే కెమెరాతో మీకు కావలసిన ఉత్పత్తిపై ఉండే బార్ కోడ్‌ను స్నాప్ చెయ్యాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఉత్పత్తికి సంబంధించిన వెబ్ సైట్ లింక్‌లు, ఇతరత్రా సమాచారాన్ని ఆరా సాఫ్ట్‌వేర్ సేకరించి మీ మొబైల్ లేదా పోర్టబుల్ సాధనాల ద్వారా మీకు అందిస్తుంది. తద్వారా సంబంధిత ఉత్పత్తి ఏ ఏ మార్కెట్లలో ఎంతెంత ధరల్లో లభిస్తోంది, వాటి నాణ్యతా ప్రమాణాలు వంటి ఎన్నో వివరాలను తెలుసుకోవ
చ్చు. మరో ముఖ్యాంశం ఏమంటే వినియోగదారులు ఆరా వెబ్ సైట్‌కు వెళ్లి వివిధ ఉత్పత్తులకు సంబంధించి సమీక్షలను పోస్ట్ చెయ్యవచ్చు మరియు ఇతర సమీక్షలను వీక్షించవచ్చు. అంటే షాపింగ్ ప్రియులకు ఇదో చర్చావేదికలా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ వారి కమ్యూనిటీ టెక్నాలజీస్ గ్రూప్‌లో ఎమ్ఎస్ ఆరా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేసే పరిశోధకులు బృందంలో ఒకరైన మార్క్ స్మిత్ స్పందిస్తూ త్వరలో రాబోయే ఈ సాఫ్ట్‌వేర్ కోట్లాది మంది వినియోగదారులను ఆకట్టుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. |