మైక్రోసాఫ్ట్ నుంచి నేర పరిశోధన సాఫ్ట్‌వేర్
ఎన్ని చట్టాలు, ఎన్నెన్ని సాక్ష్యాలు, ఎంత ఎక్కువ సిబ్బంది ఉన్నా నానాటికీ పెరిగిపోతున్న నేరాలను అదుపు చెయ్యడమనేది ఎంత పెద్ద వ్యవస్థకైనా ఒక దశలో కష్టసాధ్యమే అవుతుంది. అదీగాక సంఘ విద్రోహ శక్తులు కూడా ఇప్పుడు సాంకేతికంగా ఎదిగిపోతూ సవాళ్లను విసురుతుండటంతో పరిస్థితి నానాటికీ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో శీఘ్ర గతిన నేరాలను పరిశోధించి, పరిష్కరించే దిశగా పోలీసు, రక్షణ శాఖలకోసం ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.
నేరస్థులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకుంటూ వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో నేరస్థుల కదలికలను అనుక్షణం కనిపెట్టి, వారి ప్రణాళికలు, పథకాలను ఊహించి వాటిని నిరోధించాలంటే పోలీసులకు వివిధ అంశాలపై స్థానిక మరియు అంతర్జాతీయ స్థాయిల్లో పరిజ్ఞానం తప్పనిసరి. అప్పుడే వివిధ ప్రాంతాల్లో, పలు స్థాయిల్లో జరిగే నేరాలను అరికట్టడం పోలీసు వ్యవస్థకు సాధ్యమవుతుంది. ముఖ్యంగా నకిలీ కరెన్సీ ముద్రణ, పెద్ద పెద్ద కంపెనీల్లో డేటా చౌర్యం జరగడం తదితర కేసులను సులభంగా పరిష్కరించాలంటే కింది స్థాయి పోలీసులకూ అంతో ఇంతో సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ సంగతిని గుర్తించిన భారత ప్రభుత్వం పోలీసులకు ఉన్నత స్థాయి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందచేసే దిశగా నడుం బిగించింది. ఇందులో భాగంగా కేసుల విచారణ ప్రక్రియలను కంప్యూటర్ల ద్వారా నిర్వహించేందుకు ప్రణాళికలు చెయ్యడంతో పాటు నేర పరిశోధన కోసం మైక్రోసాఫ్ట్ రూపొందించిన సాఫ్ట్‌వేర్ వాడకంలో శిక్షణ అందించే ప్రయత్నాలకు రంగం సిద్థమైంది.
పోలీసు శాఖలో సిబ్బంది స్వయంగా చేపట్టే నేర పరిశోధన ప్రక్రియను డిజిటలైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం మైక్రోసాఫ్ట్‌తో కలిసి సీన్ ఆఫ్ క్రైం అప్లికేషన్లను రూపొందించటం జరిగింది. దీని ద్వారా ఎఫ్ఐఆర్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వ్యవస్థీకరించుకోవచ్చు. అంతేకాకుండా ఆయా తేదీలు, సంవత్సరాల ప్రకారం దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన పోలీసు స్టేషన్ నుంచైనా నేరస్థులకు సంబంధించిన నేరాల చిట్టాలను క్షణాల్లో రాబట్టే సౌకర్యం కలుగుతుంది. ఇందుకోసం వివిధ పోలీసు స్టేషన్లను నెట్‌వర్క్ ద్వారా అనుసంధానిస్తారు.
మైక్రోసాఫ్ట్ అందించే ఈ సాఫ్ట్‌వేర్‌లో నేరస్థుల గత చరిత్ర, వారి నేర స్వభావం, బాధితుల మరియు సాక్షుల వివరాలు, నేరం మరియు ఘటనా స్థలికి సంబంధించిన పోటోలు, వీడియోలు, వేలిముద్రల సమాచారాన్ని డిజిటల్ పద్దతిలో పొందుపరుచవచ్చు. న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చినప్పుడు ఈ వివరాలను అతి సులభంగా పొందవచ్చు. వీటి ఆధారంగా పూర్తి స్థాయి నివేదికలను త్వరితగతిన సిద్ధం చేయడం అధికారులకు వెను వెంటనే సాధ్యమవుతుంది. ఇదే పద్దతిలో జిల్లాలు, రాష్ట్రాల స్థాయిలో నేరాల నివేదికలు, సంబంధిత డేటాను క్రోడీకరించి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో సమాచార కేంద్రంగా ఉపయోగించుకొనే సౌలభ్యం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల మధ్య నేరస్థుల అప్పగింత తదితర ప్రక్రియలను సులభతరం చేసుకునే దిశగా నేర పరిశోధనను వ్యవస్థీకరించుకొనేందుకు ఈ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ పోలీసు, రక్షణ శాఖలకు చేయూతనిస్తుందనడంలో సందేహం లేదు. |