ప్రాంతీయ భాషలకు ఊపిరి పోస్తున్న స్థానీకరణ
కంప్యూటర్‌ను వాడటానికి ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి అనేది పాత మాట. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థ సహా పలు సంస్థలు తమ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను స్థానీకరించి (లోకలైజేషన్) స్థానిక భాషల్లో లభ్యమయ్యేలా చూస్తున్నాయి. ఇందుకోసం భాషావేత్తల సాయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచాన్నే ఓ సాంకేతిక కుగ్రామంగా మార్చిన ఇంటర్నెట్‌లోని విద్యుల్లేఖా (ఇ-మెయిల్) వ్యవస్థ, ఆన్‌లైన్ చాటింగ్ సదుపాయాలను స్థానిక భాషలు తెలిసిన గ్రామీణులు కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వినియోగించుకోవచ్చు.
ఈ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల స్థానీకరణకు సంబంధించిన సూచనలు, సహాయ పాఠాలు, మార్గదర్శినులను భాషావేత్తల సాయంతో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇప్పటికే స్థానిక భాషల్లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టింది. ఇంటర్నెట్లో ఎంతో కీలకమైన శోధన (సెర్చ్) సదుపాయం, వ్యాసాంగాల రూపకల్పనలో అక్షరదోషాల దిద్దుబాటుకు కావలసిన ప్రాంతీయ భాషా నిఘంటు సదుపాయాలు ఇప్పటికే కొన్ని భారతీయ భాషల్లో సిద్ధం కాగా, అమలుకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. కంప్యూటర్ పేరు తెలిసిన ప్రతి ఒక్కరూ ఉపయోగించే విండోస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు సహా వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, నోట్‌ప్యాడ్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఇక మన మాతృభాషల్లో లభ్యం.
ఈ స్థానీకరణ ప్రక్రియ సాఫ్ట్‌వేర్లకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రముఖ బ్యాంకులు సైతం ఈ దిశగా దృష్టి సారించాయి. పలు బ్యాంకులు నగదు ఉపసంహరణ యంత్రాల్లోని (ఏటిఎమ్) సూచనలు, ఆదేశ మీటలను (కమాండ్ బటన్లు) కూడా ప్రాంతీయ భాషలతో స్థానీకరించి గ్రామీణ వినియోగదార్లను ఆకట్టుకొనే దిశగా పరుగులు పెడుతున్నాయి. వీటన్నిటికీ తెరవెనుకనున్న భాషా నిపుణుల కృషి చాలా ఉంది.
పల్లెల్లో సైతం ఇంటర్నెట్‌కు పెరిగిన ప్రాధాన్యతను గమనించిన పలు బహుళ జాతి సంస్థలు భాషావేత్తల సహకారంతో తమ వెబ్‌సైట్లలోని సమాచారం స్థానిక భాషల్లోనూ అందచేసే దిశగా సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వారి యునికోడ్ ఫాంట్‌తో ఈ అక్షరాకృతుల మధ్య ఏకరూపత సాధ్యమై ప్రాంతీయ భాషల్లోనే మొత్తం సమాచారాన్ని వేగంగా పొందే అవకాశాలు మెరుగయ్యాయి. సాంకేతిక వ్యవస్థ ఎంతగా మెరుగైందంటే, ప్రాంతీయ భాషల అక్షరాకృతులను వేర్వేరుగా కొనుక్కొని కంప్యూటర్లలో దాచుకోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం పరిణామం అటు ముద్రణ, ఇటు వెబ్ రంగాలకు చేయూతనిచ్చింది.
మొబైల్ రంగం... సామాన్యుల నుంచి మాన్యుల వరకూ మొబైల్ ఫోన్ అవసరంలేని వారు కనిపించని రోజులివి. దీంతో మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు భాషా నిపుణుల తోడ్పాటుతో తమ ఉత్పత్తులను ఆయా స్థానిక భాషలతో వాడుకొనేందుకు వీలుగా రూపొందిస్తున్నాయి. వాడుక సూచనలు, సాంకేతిక అంశాలను స్థానిక భాషల్లోనే అందిస్తున్నాయి. ఇంకోపక్క సెల్ సేవలందించే సంస్థలు వార్తలు, విఫణి విశేషాలు, వినోద, విజ్ఞానపరమైన ఎన్నో విషయాంశాలను ప్రాంతీయ భాషల్లో అందిస్తూ ఆయా ప్రజల మాతృభాషలకు ఊపిరిపోస్తున్నాయి. |