Go Search

ఫలితాల వెల్లడిలో మేటి మన ఐటీ

పరీక్షా ఫలితాల వెల్లడి అనగానే అందరిలోనూ ఆదుర్దా. పత్రికల కార్యాలయాలకు ఫోన్లు చేయడం, దినపత్రిక కోసం పొద్దుటే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడటం లేదా ఫలితాలను విడుదల చేసే కార్యాలయం ముందు తొక్కిసలాట మధ్య గుమిగూడటం. విద్యార్థుల వంతు ఇది కాగా, ఫలితాలను వెల్లడించడానికి ప్రత్యేక సంచికలను విడుదల చేయడం, మిగతా పత్రికలకంటే ముందే వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి వెళ్లడం కోసం పత్రికల చేసే తంతు మరో అంకం. నిన్నటి వరకూ మనకు కనిపించిన దృశ్యం ఇదే. మరి నేడో ! ఐటీ సేవల వినియోగంతో పరీక్షా ఫలితాల వెల్లడి ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అటు జనానికి, ఇటు పత్రికలకు ఈ పాట్లు తప్పాయి. పరీక్షా ఫలితాల కోసం ఒకప్పుడు విద్యార్థులు పరుగులు తీయగా... ఇప్పుడు విద్యార్థులు ఉన్న చోటికే ఫలితాలు వస్తున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం మనకు అందిస్తున్న ఈ సేవల గురించి మరిన్ని వివరాలు మీ కోసం...

వెబ్‌సైట్లు...
పదవ తరగతి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ కోట్లాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షా ఫలితాలను అందించే విషయంలో వెబ్‌సైట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫలితాలను వెల్లడించే సంస్థలు అందించే సీడీలలోని డేటాబేస్‌ను వెబ్‌సైట్‌లో హోస్ట్ చేయడం ద్వారా ఒకే సమయంలో అవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ఫలితాల వెల్లడి సమయంలో సమాచారం కోసం కోట్లాది మంది ఒక్కసారిగా వెబ్ ప్రపంచంలోకి దూసుకువస్తారు. అయినప్పటికీ లైన్ల మధ్య రద్దీ ఏర్పడకుండా నివారించేందుకు ఆయా వెబ్‌సైట్ల నిర్వాహకులు అదనంగా సర్వర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్లను పత్రికలు, విద్యా రంగానికి చెందిన ప్రభుత్వ శాఖలు మరియు ప్రయివేటు సంస్థలు, విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. ఏ ఏ వెబ్‌సైట్లలో పరీక్షల ఫలితాలు వస్తున్నాయనే విషయాన్ని టీవీ ఛానళ్లు కూడా ప్రసారం చేస్తున్నాయి.

మార్కుల జాబితాలు...
ఒకప్పుడైతే పత్రికల ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో మన హాల్ టికెట్ నంబరు ఎక్కడుందో వెదుక్కొని పాసయ్యామా, ఫెయిలయ్యామా అనేది తెలుసుకొనేవాళ్లం. దురదృష్టవశాత్తూ ఫెయిలైతే, ఏ సబ్జెక్ట్‌లో మార్కులు తక్కువ వచ్చాయో తెలుసుకోవడానికి మార్కుల జాబితాల కోసం మరి కొన్ని రోజులు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇంటర్నెట్‌లో మార్కుల వివరాలతో కూడిన పరీక్షా ఫలితాలు అందుబాటులోకి వస్తున్నాయి (కొన్ని పరీక్షల విషయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు మార్కులకు బదులు గ్రేడింగ్ ఇస్తున్నారు). వాటిని వెంటనే ముద్రించుకొనే అవకాశం కూడా ఉంది. అయితే, తర్వాత పాఠశాలలకు లేదా కళాశాలలకు వచ్చే అసలైన మార్కుల జాబితాలతో ఇంటర్నెట్ మార్కుల జాబితాలను సరి చూచుకోవడం మంచిది.

బ్రౌజింగ్ సెంటర్లకు ఆదాయం...
ఫలితాల వెల్లడి అనగానే విద్యార్థులతో పాటు బ్రౌజింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా అంతే ఆదుర్దాగా ఎదురు చూస్తుంటారు. ఇంటర్నెట్ సదుపాయం లేని వారంతా బ్రౌజింగ్ సెంటర్లపై ఆధారపడుతుంటారు కనుక వీరికి ఇదొక ఆదాయమార్గం. హాల్ టికెట్ నంబర్ ఆధారంగా మార్కుల జాబితాలను ముద్రించి అమ్మడం ద్వారా బ్రౌజింగ్ సెంటర్ల నిర్వాహకులు అదనంగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఫలితాల వెల్లడి సమయంలో బ్రౌజింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది.

కానుకలు - కెరీర్ వివరాలు...
పరీక్ష ఫలితాలను అందించే పలు వెబ్‌సైట్లు విద్యార్థులను ఆకట్టుకొనే దిశగా పలు పోటీలను నిర్వహిస్తుంటాయి. ఫలితాల రాకకు ముందుగానే ఇందుకోసం ఒక ఛానెల్‌ను ఏర్పాటు చేసి పేర్ల నమోదు చేసుకోవలసిందిగా విద్యార్థులను ఆహ్వానిస్తాయి. ఎన్ని మార్కులు వస్తాయని ఊహిస్తున్నారో చెప్పాల్సిందిగా పేర్ల నమోదు సమయంలో కోరతాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఊహించిన మార్కులు, వచ్చిన మార్కులు దాదాపు ఒకటే అయితే, కానుకలు ఇస్తున్నాయి. అంతేగాక సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణులైతే లభించే విద్యా, ఉద్యోగ అవకాశాలను తెలియజేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రయివేటు సంస్థలు కూడా పాల్గొని వాణిజ్య ప్రకటనలు ఇస్తూ బహుమతులను సమర్పిస్తున్నాయి. ఫలితాలను వెల్లడించే వెబ్‌సైట్లకు ఇదో ఆదాయమార్గం.

సెల్‌ఫోన్...
వెబ్‌సైట్ల సంగతి ఇలా ఉంటే, ఈ ప్రక్రియను సెల్‌ఫోన్ మరికొంత ముందుకు తీసుకెళ్లింది. హాల్ టికెట్ నంబర్‌ను ఎస్ఎమ్ఎస్ చేస్తే అరచేతిలోకే ఫలితాలు వచ్చేస్తున్నాయి. మరి కొంచెం ఒపిక పడితే కొన్నాళ్లకు మొబైల్ నుంచే మార్కుల జాబితాను ముద్రించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చే వీలుంది.

టెలిఫోన్...
ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సహా ల్యాండ్ లైన్ ఫోన్ సేవలందించే పలు టెలికాం సంస్థలు ఐ వీ ఆర్ ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) వ్యవస్థ ద్వారా మార్కులను అందిస్తున్నాయి. అంటే, టెలిఫోన్ కీప్యాడ్ ఉపయోగించి మీ హాల్ టికెట్ నంబర్‌ను టైప్ చేస్తే మీ మార్కులు లేదా ఫలితాల వివరాలు వినిపిస్తాయి.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.